భారత అంతర్జాతీయ చలన చత్రోత్సవంలో ‘మహానటి’: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/MAHANATI
49వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈరోజు గోవాలో జరగనుందని నవతెలంగాణ పత్రిక ఓ వార్తను ప్రచురించింది. ఇందులో..
ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ పనోరమలో భాగంగా 26 చిత్రాలు పోటీపడుతుండగా తెలుగు నుంచి 'మహానటి' ఎంపికైంది. బాలీవుడ్ నుంచి పద్మావత్, రాజీ, టైగర్ జిందాహై చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి.
మొత్తం 15 దేశాలకు చెందిన 212 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన 16 సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు.
ఈ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన 'విలేజ్ రాక్‌స్టార్స్' సినిమా విదేశీ విభాగంలో ఆస్కార్‌కు అధికారికంగా అర్హత సాధించింది. కానీ గోవాలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో మాత్రం ఆ సినిమాకు చోటు దక్కలేదు.
నవంబర్ 20న ప్రారంభమయ్యే ఈ వేడుక 28తో ముగుస్తుందని నవతెలంగాణ పత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘వారంతా ఆరెస్సెస్సే!"
శబరిమల ఉదంతంపై కేరళ మరోసారి భగ్గుమంది అంటూ ఈనాడు పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
శబరిమల ఆలయ సముదాయంలో పోలీసులు 69 మంది భక్తులను అరెస్టు చేసిన సంఘటనపై రాష్ట్రం అట్టుడికింది. ఆదివారం రాత్రి మొదలైన ఆందోళనలు, నిరసనలు సోమవారం అంతకంతకూ తీవ్రరూపం దాల్చాయి.
పోలీసుల నిర్బంధం, సౌకర్యాల లేమికి నిరసనగా ఆదివారం రాత్రి నుంచి పెద్దసంఖ్యలో భక్తులు సన్నిధానంలో అయ్యప్ప నామజపం చేస్తూ ఆందోళన చేపట్టారు.
దీంతో రాత్రివేళ సన్నిధానంలో ఉండేందుకు వీల్లేదని, వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. భక్తులపై విరుచుకుపడ్డారు. పరిసరాల్లో నిద్రించకుండా నీళ్లు గుమ్మరించారు.
144 సెక్షన్ అమల్లో ఉందని, ముందస్తు జాగ్రత్తల పేరిట.. ఆలయ సముదాయంలో ఆదివారం రాత్రి 69 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు.
సోమవారం ఉదయం వారిని అరెస్టు చేసి సాయంత్రం కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. శబరిమలలో భక్తులను నిర్బంధంలోకి తీసుకోవడం ఇదే తొలిసారి.
అయితే.. పోలీసుల చర్యలను కేరళ హైకోర్టు తప్పుబట్టింది. ఈ తరహా ఘటనలు పునరావృతం అయితే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
శబరిమలలో 15 వేల మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించింది. నెయ్యభిషేకం టికెట్లు కొన్న భక్తుల్ని సన్నిధానంలో ఉండేందుకు అనుమతించాలని ఆదేశించింది.
''వామపక్ష ప్రభుత్వం భక్తుల వెంటే ఉంది. అరెస్టయిన వారంతా అయ్యప్ప భక్తులు కాదు. సమస్యల్ని సృష్టించాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని సన్నిధానంలో మోహరించారు. శబరిమలలో సమస్యల్ని సృష్టించేవారెవ్వరినీ మా ప్రభుత్వం విడిచిపెట్టదు'' అని కేరళ ముఖ్యమంత్రి అన్నారని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, facebook/TDP
‘మేమంతా ఒక్కటే..!’
బీజేపీ వ్యతిరేక పార్టీల కూటమి భవిష్యత్ కార్యాచరణ గురించి మమతా బెనర్జీ, చంద్రబాబు చర్చించినట్లు సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
సోమవారం ఆయన కోల్‌కతాలో మమతతో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేయాలన్నదానిపై తాము చర్చించామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని, సీనియర్ నాయకులుగా అది తమ బాధ్యత అన్నారు.
తమ రాష్ట్రాల్లోకి సీబీఐ లాంటి కేంద్ర సంస్థలు రాకుండా సమ్మతిని ఉపసంహరించుకున్న అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు గుర్తుచేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్‌బీఐ, కాగ్ తదితర సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఈ నెల 22న దిల్లీలో నిర్వహించాలనుకున్న సమావేశం ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా వాయిదా పడిందని, ఎప్పుడు సమావేశమయ్యేది తర్వాత నిర్ణయిస్తామన్నారు.
డిసెంబరు 11 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయని, ఆ సమావేశాల ఆరంభానికి ముందే బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ సమావేశమయ్యే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు.
బీఎస్‌పీ అధినేత్రి మాయావతితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్నకు.. మోదీ కన్నా తామందరం సీనియర్లమని చంద్రబాబు జవాబిచ్చారు.
మమతా బెనర్జీ మాట్లాడుతూ.. దేశాన్ని పరిరక్షించుకొనేందుకే కలిసి నడుస్తున్నామని, ఇకపై కూడా కలిసే పనిచేయబోతున్నామని చెప్పారు.
బీజేపీ వ్యతిరేక పక్షాలన్నిటినీ ఎవరు ముందుండి నడిపిస్తున్నారన్న విలేఖరుల ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... అందరూ ముందుండి నడిపిస్తారని అన్నారని సాక్షి దినపత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
నేటి నుంచే భూధార్
రాష్ట్రంలో భూమి వివాదాలను పరిష్కరించేందుకు భూములకు 11 అంకెల విశిష్ట నంబరు కేటాయించే భూధార్ ప్రాజెక్టు మంగళవారం అమల్లోకి రానున్నట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
దేశంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చినట్టే, భూములకూ విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఆ భూమి వివరాలను శాటిలైట్ మ్యాప్స్‌తో అనుసంధానం చేసే ప్రాజెక్టే భూధార్.
తొలుత కృష్ణా జిల్లాలో భూధార్ పైలెట్ ప్రాజెక్టు అమలు చేశారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూముల రికార్డులను ఇప్పటికే డిజిటలైజ్ చేశారు.
వెబ్‌ల్యాండ్ కేంద్రంగా ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. భూమి చిత్రపటాలు (ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్స్-ఎఫ్‌ఎమ్‌బీ) డిజిటలైజ్ అవుతున్నాయి.
ఇప్పటికే డిజిటలైజ్ అయిన ఎఫ్‌ఎమ్‌బీలను వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానించారు. ప్రతి భూమికి సర్వే నంబరు ఆధారంగా భూధార్ ద్వారా జీపీఎస్ పరిధిలోకి తీసుకొచ్చారు.
భూముల అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా కో-ఆర్డినేట్ సర్వర్‌లోకి అప్‌లోడ్ చేశారు. ఇక ప్రతి భూమికి రాష్ట్రం, జిల్లా, గ్రామం కోడ్ ఉండేలా 11 అంకెల విశిష్ట నంబరు కేటాయిస్తారని ఈనాడు కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- ఈ వీడియోని మీరు చూడండి, మీ పిల్లలకూ చూపండి
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'
- కిలోరాయి మారుతోంది.. మరి మీ బరువు మారుతుందా? మారదా?
- దిల్లీలో విషపు గాలి మమ్మల్ని చంపేస్తోంది.. కానీ ఆకలి ఆగనీయదు
- హిమాలయ పర్వతాలపై తేనె సేకరించేందుకు ప్రాణాలు పణంగా పెడుతున్న నేపాలీలు
- కోతుల బెడద: నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























