వరవరరావును మళ్లీ అరెస్ట్ చేసిన పుణే పోలీసులు

వరవరరావును అరెస్ట్ చేసిన పుణే పోలీసులు
ఫొటో క్యాప్షన్, వరవరరావును అరెస్ట్ చేసి పుణే తరలిస్తున్న పోలీసులు
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

విప్లవ రచయిత, హక్కుల కార్యకర్త పెండ్యాల వరవరరావును పుణే పోలీసులు మరోమారు అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావు ఇంటికి శనివారం రాత్రి వచ్చిన పోలీసులు ఆయనను ట్రాన్సిట్ వారెంట్‌పై పుణెకు తరలిస్తున్నారు.

"వరవరరావును ఈ రాత్రి 11 గంటల విమానంలో పూణేకు తీసుకెళ్తున్నట్లు పోలీసులు మాకు చెప్పారు. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామన్నారు" అని ఆయన కుటుంబ సభ్యులు బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినికి తెలిపారు.

మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో చోటు చేసుకున్న హింస కేసుకు సంబంధించి ఆగస్టు 28వ తేదీన దేశవ్యాప్తంగా దాడులు చేసిన పూణె పోలీసులు అయిదుగురు ఉద్యమకారులు - వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను అరెస్ట్ చేశారు.

వారిని వెంటనే విడుదల చేయాలని, వారి అరెస్టులపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రముఖ చరిత్రకారురాలు రోమిలా థాపర్‌ సహా పలువురు కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్‌పై ఆగస్టు 29న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వారికి తాత్కాలిక ఊరట కల్పిస్తూ... తదుపరి విచారణ జరిగే వరకూ వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది.

దాంతో ఆగస్టు 29 నుంచి వరవర రావు గృహ నిర్బంధంలో ఉన్నారు.

ఆగస్టు 28న పుణె పోలీసులు ఇచ్చిన ట్రాన్సిట్ వారెంట్‌ను వరవరరావు తరఫు న్యాయవాదులు హైదరాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు.

ఆ వారెంట్ మరాఠీలో ఉందని దాన్ని కొట్టివేయాలని లాయర్లు న్యాయస్థానాన్ని కోరారు. ఇవాళ వరవర రావు అరెస్టుని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

ఈ అరెస్టు అన్యాయం: వరవరరావు మేనల్లుడు

"ఈ అరెస్టు అన్యాయం. పుణె పోలీసులు ఇచ్చిన ట్రాన్సిట్ వారెంట్ చెల్లదని శుక్రవారం కోర్టు చెప్పింది. ఆ వారెంట్ చెల్లనప్పుడు అరెస్టు ఎలా చేస్తారు? గంట క్రితమే పుణె పోలీసుల బృందం వచ్చింది. వాళ్లు తాజా వారెంట్, లేదా హైకోర్టు ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు. ఆ పత్రాలు అవసరం లేదని వాళ్లు అంటున్నారు. పోలీసులు చేసిన అనేక అన్యాయాల్లో ఇదొకటి" అని వరవరరావు మేనల్లుడు వేణుగోపాల్ అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

పుణె పోలీసులు అరెస్ట్ చేసిన హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులు - వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను గృహ నిర్బంధంలో ఉంచాలని ఆగస్టు 29న సుప్రీంకోర్టు ఆదేశించింది.

మరో ఇద్దరు హక్కుల కార్యకర్తలు.. గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లు ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉన్నందున ఆ నిర్బంధాన్ని కొనసాగించింది.

సెప్టెంబర్ 28వ తేదీన వీరి గృహ నిర్బంధాన్ని మరో నాలుగు వారాలపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, తమకు బెయిల్ ఇవ్వాలంటూ వారు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తల అరెస్టులో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. ఈ కేసులో తదుపరి చర్యల నిమిత్తం కింది కోర్టుల్ని ఆశ్రయించాలని వారికి సూచించింది.

అరెస్టులపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పరచాలన్న వీరి అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

వరవరరావు మద్దతుదారులు

ఎందుకీ అరెస్ట్‌లు?

మహారాష్ట్రలోని బీమా కోరెగావ్ వద్ద గత జనవరిలో అల్లర్లు జరిగాయి. హింస చెలరేగింది. ఎల్గార్ పరిషత్ పేరుతో దళిత మేధావులు, వామపక్ష కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారంటూ పోలీసులు ఐదుగురు కార్యకర్తలను జూన్ నెలలో అరెస్ట్ చేశారు.

దళిత సైనికులు బ్రిటీషర్లతో కలిసి పీష్వారాజుల సైన్యంపై పోరాడి విజయం సాధించిన ఘట్టానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఎల్గార్ పరిషత్ పేరుతో కొందరు దళిత , వామపక్ష కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఆ తర్వాత చెలరేగిన హింసకు కారకులంటూ హక్కుల కార్యకర్తలు రోనా విల్సన్, సుధీర్ ధావ్లే, సుధీంధ్ర గాండ్లింగ్, ప్రొఫెసర్ షోమాసేన్, మహేశ్ రౌత్‌లను అరెస్ట్ చేశారు. దిల్లీ కేంద్రంగా పనిచేసే హక్కుల కార్యకర్త రోనా విల్సన్ దగ్గర మావోయిస్టులు రాసిన లేఖ దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్రపన్నారని.. ఆ వివరాలు ఈ లేఖలో ఉన్నాయని వెల్లడించారు. వీరందరికీ మావోయిస్టులతో సంబంధాలున్నాయిని పేర్కొన్నారు. మావోయిస్టులు రాసినట్టుగా చెపుతున్న ఒక లేఖను వారు ఆధారంగా చూపించారు.

రాజీవ్ గాంధీ తరహాలో మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్టు ఆ లేఖలో ఉందని, వరవరరావు ఆ కుట్రకు ఆర్థిక సాయం చేస్తారని ఆ లేఖలో పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. అయితే ఆ లేఖ పోలీసుల కల్పితమని వరవరరావు చెప్పారు. అనేక హక్కుల సంఘాలు, రచయితల సంఘాలతో పాటు కొందరు విపక్ష నేతలు కూడా ఈ ఉత్తరం కల్పితమని విమర్శించారు. పడిపోతున్న గ్రాఫ్‌ను నిలబెట్టుకోవడానికి మోదీ సర్కారు ఇలాంటి డ్రామాలు ఆడే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)